google-site-verification: googleb373ea7e16bf462c.html

ఈ చిత్రం నా మనస్సును కలచి వేసింది!

ఈ చిత్రంలోని మెక్సికన్ మహిళ పేరు జూలియా పాస్ట్రానా (25 మార్చి 1834 – 1860). ఈమె హృదయం చాలా విశాలమైనది కానీ అందరూ ఈమెని “ది మోస్ట్ హిడియస్ పేస్ (అత్యంత అంద వికారమైన ముఖం)” అని పిలిచేవారు.

ఆమె 1834లో మెక్సికోలోని ఒక పర్వత ప్రాంతంలో జన్మించింది. ఆమె పుట్టినప్పటి నుంచి హైపర్ ట్రైకోసిస్ టెర్మినల్స్ అనే జన్యుపరమైన రుగ్మత వల్ల ఆమె శరీరం మొత్తం జట్టు వేగంగా పెరిగేది. ఆమె ముఖం మరియు శరీరం నిటారుగా నల్లని జుట్టుతో కప్పబడి ఉండేవి. చెవులు, ముక్కు అసాధారణంగా, పళ్లు పెద్దవిగా అపక్రమంగా ఉడేవి. ఇది కాక ఆమెకు జింజివల్ హైపర్ ప్లాసియా అనే నిర్ధారించబడని అరుదైన వ్యాధి కూడా ఉంది. దీని వల్ల ఆమె పెదవులు మరియు చిగుళ్ళు మందంగా ఉండి రాక్షసిలా ఉండేది.

పాస్ట్రానా తన తల్లి మరణించేంత వరకు ఆమెతో నివసించింది. దాని తరువాత ఆమె మామ ఆమెను సర్కస్ కు అమ్మాడు. సర్కస్ లో పనిచేసే థియోడోర్ లెంట్ అనే వ్యక్తిని కలుసుకుంది. అతను అదే సర్కస్ లో ఉద్యోగం ఇప్పించాడు. లెంట్ ఆమె నిర్వహణ బాధ్యతలు చూసేవాడు. వారు యుఎస్ మరియు ఐరోపా అంతటా పర్యటించారు. పాస్ట్రాన ఒక జంతువు మరియు మనిషి మధ్య సంకర జాతివలె ప్రచారం చేయబడింది.“బాబూన్ లేడీ”, “కుక్క-ముఖం కలిగిన మహిళ”, “జుట్టు గల మహిళ”, “ఏప్-ఫేస్డ్ ఉమన్”, “ఏప్ ఉమన్”, “బేర్ వుమన్”, మరియు “ది నాన్ డెస్క్రిప్ట్” అనే రంగస్థల పేర్లతో సైడ్ షోస్ మరియు ఫ్రీక్ షోలలో పనిచేసింది.

అయితే ఆమె ప్రదర్శనల సమయంలో ఆమె తన తెలివితేటలను మరియు ప్రతిభను చూపించేది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం ద్వారా ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వగలిగిన నేర్పరి. అయితే ప్రజలు చూడటానికి డబ్బు చెల్లించే వస్తువుగా ఆమె మారిపోయింది!

జూలియా పాస్ట్రానా షొ ప్రకటన

ఆమె తన షో ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు, కీర్తిని సంపాదించిది. ఆమె మేనేజర్ థియోడోర్ లెంట్, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో లెంట్ తో ఆమె వివాహం జరిగింది. ఆ సమయంలో అత్యంత ప్రసిద్ధ వివాహాలలో ఇది ఒకటి, వార్తాపత్రికలలో వైరల్ గా మారింది. ఒక సాధారణ వ్యక్తి 135సెం.మీ పొడవైన రాక్షససిని ఎలా వివాహం చేసుకోగలుగుతాడు అని వారు ప్రశ్నించారు. అయితే ఆమె లక్షణాలు గల శిశువుకు ఆమె జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఆమె ప్రసవించిన 48 గంటల తరువాత శిశువుతో కలిసి మరణించింది. చనిపోయేనాటికి ఆమె వయస్సు కేవలం 26 సంవత్సరాలు.

జూలియా యొక్క దురదృష్టం ఆమె మరణంతో ఆగలేదు. తన భర్త లెంట్ దురాశతో పాస్ట్రానా శరీరాన్ని వారి కుమారుడి శరీరాన్ని మాస్కో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సుకొలోవ్ కు అమ్మాడు. ఆమె శరీరాన్ని టాక్సీడర్మికల్ ప్రక్రియ ద్వారా మమ్మిగా మార్చారు. అయితే కొంతమంది ప్రొఫెసర్లు ఇది పూర్తి మమ్మి ప్రక్రియ కాదని తెలిపారు. ఆ శవాలను సుకొలోవ్ భద్రపరిచిన తర్వాత, లెంట్ వాటిని తిరిగి కొనుగోలు చేసి వాటిని యూరప్ అంతటా ప్రదర్శించడం ప్రారంభించాడు.

ప్రజలు ఇప్పటికీ సగం కోతి సగం మనిషి రూపంలో ఉన్న పాస్ట్రానా మమ్మిని  చూడటానికి వెళ్ళేవారు. లెంట్ తరువాత ఇదే విధమైన లక్షణాలతో ఉన్న మరొక మహిళను కనుగొన్నాడు. ఆమెను వివాహం చేసుకుని ఆమె పేరును మేరీ బార్టెల్ నుండి జెనోరా పాస్ట్రానాగా మార్చాడు. ఆమె కూడా ప్రదర్శనల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిది. ఆ తర్వాత 1884లో అతను మరణించాడు.

జూలియా పాస్ట్రానా యొక్క మమ్మి

వందేళ్లకు పైగా పాస్ట్రానా, ఆమె కుమారుడి మృతదేహాలను మ్యూజియంలు, సర్కస్ లు, అమ్యూజ్ మెంట్ పార్కుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. 1973లో స్వీడన్ లో జరిగిన ఒక పర్యటనలో గణనీయమైన ప్రజా వ్యతిరేకత రావడంతో ప్రదర్శన నిలిపివేశారు. 1976 ఆగస్టులో మమ్మీలు ఉన్న కేంద్రంలో కి చొరబడి, శిశువు శరీరాన్ని ధ్వంసం చేశారు. మిగిలిన శిశువు అవశేషాలను ఎలుకలు తినేసాయి. జూలియా శరీరాన్ని 1979లో దొంగిలించారు, అయితే మృతదేహాన్ని పోలీసులకు కనుగొన్న తరువాత ఓస్లో ఫోరెన్సిక్ ఇనిస్టిట్యూట్ లో ఉంచారు. 1994లో నార్వే సెనేట్ ఆమె అవశేషాలను పూడ్చాలని సిఫార్సు చేసింది కానీ అక్కడి మంత్రి వాటిని ఉంచాలని నిర్ణయించారు. తద్వారా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయవచ్చు.

జూలియా పాస్ట్రానా యొక్క మమ్మి

2 ఆగస్టు 2012న పాస్ట్రానాను ఒక నిర్దిష్టతేదీలో మెక్సికోలో ఖననం చేస్తారని ఆఫ్టెన్పోస్టన్ లో నివేదించబడింది. ఫిబ్రవరి 2013లో సినాలోవా రాష్ట్ర గవర్నర్ మారియో లోపెజ్ వాల్డెజ్, న్యూయార్క్ దృశ్య కళాకారుడు లారా ఆండర్సన్ బార్బటా, నార్వేఅధికారులు మరియు ఇతరుల సహాయంతో, మృతదేహాన్ని సినాలోవా యొక్క ప్రభుత్వానికి అప్పగించబడింది. వందలాది మంది క్యాథలిక్లు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆమె అవశేషాలు ఆమె జన్మస్థలం సమీపంలోని సినాలోవా డి లేవా లోని ఒక స్మశానవాటికలో ఖననం చేయబడ్డాయి.

చివరకు 150 స౦వత్సరాల తర్వాత జూలియాకు గౌరవప్రదమైన అ౦త్యక్రియలు చేసి ఒక వ్యక్తిలా సమాధి చేయబడి౦ది!

నిజంగా జూలియా రాక్షసా? లేదా ఆమె భర్త? లేదా ఆమెను చూసేందుకు డబ్బులు చెల్లించేవారా? లేదా ఆమె కుటుంబమా? లేదా ప్రపంచమా?!

ఉత్తరాఖండ్, రూప్ కుండ్ సరస్సులో అస్తిపంజరాల గుట్ట.. అంతుబట్టని మిస్టరీ!

  1. చుట్టూ వందల కొద్దీ పురాతన అస్థిపంజరాలున్నసరస్సు అది. వారిని చంపింది ఎవరు?
  2. పుర్రెల వెనుక భాగంలో క్రికెట్ బంతి సైజు రంథ్రాలు

1942లో రూప్ కుండ్ లోని ఒక బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ ఒక భయంకరమైన విషయం కనుగొన్నాడు. అదేంటంటే, సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో ఒక చిన్న లోయ, అడుగున పూర్తిగా అస్థిపంజరాలతో నిండిన ఒక ఘనీభవించిన సరస్సు. ఆ వేసవిలో మంచు కరగడం వల్ల మరిన్ని అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. నీటిలో తేలుతూ సరస్సు అ౦చుల చుట్టూ వున్నాయి. ఇక్కడ ఏదో ఘోరం జరిగింది అనుకున్నాడు.

అది యుద్ధ సమయం కావడంతో భారతదేశంలోకి దొంగతనంగా వచ్చి మరణించిన జపాన్ సైనికుల అవశేషాలు అని భావించాడు. జపాన్ భూఆక్రమణకు భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం ఇది నిజమా కాదా అని తేల్చడానికి పరిశోధకుల బృందాన్ని పంపింది. అయితే, ఈ ఎముకలు జపాన్ సైనికులవి కావు. ఎందుకంటే ఎముకలు చాలా పురాతనమైనవని స్పష్టమవుతో౦ది. మాంసం, వెంట్రుకలు, ఎముకలు పొడి, చల్లని గాలి ద్వారా సంరక్షించబడ్డాయి, అయితే అవి ఎలా వచ్చాయి అనే విషయాన్ని ఎవరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. అంతకు మించి, ఈ చిన్న లోయలో 200 మంది కి పైగా ప్రజలను ఎవరు చంపారు? కొండచరియలు విరిగా, ఆత్మహత్యలా అనే అనుమానాలు వచ్చాయి. దశాబ్దాల పాటు స్కెలెటన్ సరస్సు యొక్క మిస్టరీని ఎవరూ వెలుగులోకి తేలేకపోయారు.

Roopkund_Lake00

కారణమేమిటి.....

అయితే, 2004లో జరిగిన ఒక సాహస యాత్ర ఆ ప్రజల మరణానికి కారణమేమిటనే మిస్టరీని ఎట్టకేలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎవరూ వూహించని సమాధానం వింతగా ఉంది. చెప్పాలంటే, అన్ని శరీరాలు సుమారు 850 AD నాటివి. DNA సాక్ష్యం బట్టి ఇవి రెండు వేర్వేరు సమూహాలు. ఒకటి సన్నిహిత సంబంధం కలిగిన తెగ, మరియు రెండవది చిన్న స్థానికుల సమూహం. అయితే ఇక్కడ దొరికిన రింగులు, ఈటెలు, తోలు బూట్లు, వెదురు కర్రలు వంటి అధారాలను బట్టి ఈ బృందం స్థానికుల సహాయంతో లోయ గుండా వెళ్లే యాత్రికుల సామాన్లని మోసే కూలీలు లేదా గైడులు అని భావిస్తున్నారు.

హిమాలయ స్త్రీలలో ఒక ప్రాచీన మరియు సంప్రదాయ జానపద పాట ఉంది. ఆ గేయాలలో ఒక దేవత తన పర్వతాలను అపవిత్ర౦ చేసిన వారిని ఎలా శిక్షించిందో వర్ణి౦చి౦ది. ఆ దేవత ఇనుముతో కలిసిన వడగండ్లు విసిరి వారిని చంపింది. ఒక్కసారిగా వడగళ్ల వానకు దాదాపు 200 మంది మరణించారు.

Roopkund,Trishul,Himalayas

స్థానికుల కథనం...

అయితే స్థానికుల కథనం ప్రకారం, కశ్మీర్ జనరల్ జోరావర్ సింగ్ అతడి సైన్యం 1841లో టిబెట్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మరణించారని చెబుతున్నారు. అయితే, మరికొందరు వేరే కారణాలు కూడా తెలుపుతున్నారు. కనౌజ్ జస్దావాల్ రాజు, అతడికి కాబోయే భార్య బలంపా వారి సేవకులు నృత్య బృందాలతో కలిసి నందాదేవీ ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా మంచు తుఫాన్ ఏర్పడింది. దీంతో వారంతా మంచులో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు.
తలకి  దెబ్బ తగలడంతో వారంతా ఒకే విధంగా మరణించారు. అయితే, పుర్రెల్లో చిన్న లోతైన పగుళ్లు, ఆయుధాల వల్ల కాకుండా, గుండ్రంగా ఉండే దాని ఫలితంగా ఐనట్టు కనిపించింది. శరీరాలపై  కాకుండా తలపై గాయాలు మాత్రమే ఉన్నాయి, భుజాలపై దెబ్బలు తిన్నగా పైకి వచ్చాయి.

Roopkund_Lake6

పుర్రెలు పగిలాయి..

ఈ మిస్టరీపై 2014లో శాస్త్రవేత్తలు 200 పైగా అస్తిపంజరాలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. ఇవి 9వ శతాబ్దంలో అక్కడ నివసించిన గిరిజనులవని తెలిసింది. పుర్రెల వెనుక భాగంలో క్రికెట్ బంతి సైజు రంథ్రాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే, అవి యుద్ధం లేదా ఆయుధాల వల్ల ఏర్పడినవి కావని, వడగళ్ల వాన వల్ల కావచ్చని అభిప్రాయపడ్డారు. లోయలో చిక్కుకుపోయి ఎక్కడా దాక్కోడానికి లేదా ఆశ్రయం లేని వారిపై క్రికెట్ బంతి సైజు [ సుమారు 9 అంగుళాల చుట్టుకొలత] వడగండ్లు వేలసంఖ్యలో వచ్చాయి. ఒక్కసారిగా వడగళ్ల వానకు దాదాపు 200 మంది మరణించారు. ఆ అవశేషాలు 1,200 స౦వత్సరాల పాటు ఆ సరస్సులో ఉన్నాయి. అయితే, ఇవి కూడా కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే.

Roopkund_Lake0000

ఉత్తరాఖండ్ వెళ్లినప్పుడు ఖచ్చితంగా చూండండి

ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్లినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. అస్తిపంజరాల మాట పక్కన పెడితే.. ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. ఆ దారిలో ఎన్నో జలపాతాలు, అందమైన పూల వనాలు మిమ్మల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వర్షాకాలం, చలికాలం సీజన్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం చాలా రిస్క్.